ప్రధాన గోపురం -ముఖద్వారం :
చోళుల శిల్పకళ ఉట్టిపడేలా ఉంటుంది ఆలయ నిర్మాణం .సువిశాలమైన
ప్రాంగణం లో కట్టబడిన ఈ ఆయలం లో ముఖద్వారం సుమారు ౧౬౦ అడుగులు ఉంటుంది.ఇలా అతిపెద్ద ముఖద్వారాలు భారత దేశం లో చాల తక్కువ.
ఏకశిలా మూర్తి:
భద్రాచలం లో రామయ్య సీతమ్మ విగ్రహాలు ఓక శిలపై , లక్ష్మణుని విగ్రహం మరో శిలపై ఉంటాయి. ఒంటిమిట్ట లో అందుకు భిన్నంగా...ఒకే శిలపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి.
హనుమ ఉండరు:
భారతదేశం మొత్తము మీద ఆంజనేయుడు రాముల వారి పాదాల వద్ద లేని రామ మందిరం ఇదే.ఎందుకంటే ఈ విగ్రహం చేక్కించే సమయానికి హనుమ రాముల వారిని ఇంకా కలుసుకోలేదట.
కొండపైన వెలసిన కోదండ రాముడు:
ఈ ఆలయం ఒక పెద్ద బండరాతి ని పోలిన కొండపై ఉన్నదని అందుకనే ఈ ఊరిని ఒంటిమిట్ట అని, ఏకశిలా నగరమని అంటారని చెబుతారు.
యాగ రక్షణ చేసినందుకు మూర్తి ని చెక్కించారు.
రామ కళ్యాణం జరుగక మునుపు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను యాగరక్షణకు తీసుకెళ్ళాడు.అలాగే రాముడు అరణ్యవాసం లో ఉండగా మరోసారి యాగ సంరక్షణ చేసాడట.అందుకు గాను మహర్షులు
సీతా రామ లక్ష్మణ మూర్తులని ఏక శిల పై చెక్కించారు.
జాంబవంతుడు ప్రతిష్టించాడు:
తరువాతి కాలం లో జాంబవంతుడు ఆ విగ్రహాలను ప్రతిష్టించాడు అని అంటారు.ఐతే ఆలయ నిర్మాణం పూర్తిగా చేయలేదట.
ఒంటుడు మిట్టుడు:
వూరిలో ఒంటుడు మిట్టుడు అనే దొంగలు దొంగతనాలు చేస్తూ ఇక్కడ ఆలయ ప్రాంగణం లో దాక్కుని ఉండే వారని.,తరువాతి రోజుల్లో వారికి రాముల వారి దర్శనం మార్పు వచ్చి రామ భక్తి తో ఈ మందిర నిర్మాణం ఒక్క రోజులో పూర్తి చేసి ఆ పై రాముల వారి సేవలో చివరి జీవించి కాలం చేసి చివరకు శిలలు గా మారారని చెబుతారు.ఆలయ ప్రవేశ మార్గం లో వారి విగ్రహాలను ఇప్పటికి మనం చూడవచ్చు.
అన్నమయ్య కీర్తనం :
వాగ్గేయ కారుడు అన్నమాచార్యుల వారి జన్మ స్థలం తాళ్ళపాక ఒంటిమిట్టకు
అతి చేరువలోనే ఉంది.శ్రీ అన్నమయ్య వారుఈ ఆలయం లో కూర్చొని కొన్ని కీర్తనలను రచించారని ప్రతీతి.
పోతానామాత్యుల వారు:
ఆంధ్రమహాభాగవత రచయిత శ్రీ బమ్మెర పోతన తను వ్రాసిన భాగవతాన్ని
ఈ ఒంటిమిట్ట రామునికే అంకితం చేసారని అంటారు.ఆయన తను ఏకశిలా నగర వాసిని అని పేర్కొన్నారట.
కళ్యాణం నవమి నాడు చేయరు :
ముక్కోటి దేవతల సాక్షి గా అయోధ్యరాముని వివాహం త్రేతాయుగం లో
పగటిపూట జరిగింది. ఐతే పగలు జరగడం వల్ల చంద్రుడు ఆ వివాహం చూడలేకపోయాడట.అందువల్ల చంద్రునికి రాముడు వరం ఇచ్చాడట.
తన పేరు చివర చంద్రుడి పేరుని కలుపుకొని "శ్రీ రామ చంద్రుడని "
పిలిపించుకుంటానని.అంతే కాక చంద్రునికి కనిపించేలా నిండు పున్నమి రోజున అర్ధ రాత్రి వేళ కళ్యాణం చేసుకుంటానని ....
కళ్యాణం అసలు పగలు చేయరు:
దేశం లో మరెక్కడా లేని విధం గా ఒంటిమిట్ట రామూల వారి ఆలయం లో సీతా రామ కళ్యాణం నిండు వెన్నెల వేళల్లోనే పున్నమి రోజున చేస్తారు.ఇక్కడ ఆలయం లో శ్రీరామ నవమి ఉత్సవాలు నవమి నుండి పౌర్ణమి వరకు జరుగుతాయి.
(భద్రాచలం లో ఉగాది నుండి నవమి వరకు శ్రీ రామ నవమి ఉత్సవాలు జరుగుతాయి).
శ్రీ రామ చంద్రుణ్ణి ,రామాయణాన్ని అనుసంధానం చేయడమంటే నిత్యం
రామ నామం చెప్పడం కాదు,పదే పదే రామాయణాన్ని కీర్తించడం కాదు.
రామ బాట అంటే రాముని పూలతో పూజించడం కాదు.ఆయన నేర్పిన ధర్మాన్ని అనుసరించడం ,మనిషిగా జీవించి మనకు నేర్పిన విధానాన్ని అనుసరించడం.